తెలంగాణా రాష్ట్రంలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు, ఇంకా నగదు రూపంలో కేంద్రం లక్ష కోట్లు ఇచ్చిందని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా రాష్ట్ర భాజపా నేతలు పదేపదే చెప్పుకోవడాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ తప్పు పట్టారు. రాష్ట్రం నుంచి వివిధ పన్నుల రూపేణా వెళుతున్న నిధుల కేంద్రానికి వెళుతున్న డబ్బు, అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి వస్తున్న డబ్బు గురించి అణాపైసలతో సహా అయన లెక్కలు చెప్పారు.
ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, “చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, దేశంలో కేవలం ఆరేడు రాష్ట్రాలు మాత్రమే దేశ ఆర్ధిక అవసరాలకు సరిపడినంత నిధులు. అవే దేశాన్ని సాకుతుంటాయి. వాటిలో గుజరాత్, తెలంగాణా, మహారాష్ట్ర, డిల్లీ, తమిళనాడు, కర్నాటక తదితర ఆరేడు రాష్ట్రాలున్నాయి. ఈ ఆరేడు రాష్ట్రాలే జాతీయ అవసరాలకు, లోటు రాష్ట్రాలకు అవసరమైన నిధులు సమకూరుస్తుంటాయి. ఇది నేను చెపుతున్న మాటలు కావు. కేంద్ర ఆర్ధిక గణాంకాలే చెపుతున్న వాస్తవం. దేశంలో మిగిలిన రాష్ట్రాలన్నీ లోటు రాష్ట్రాలే. లోటు బడ్జెట్ రాష్ట్రాలలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కాశ్మీర్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ ఘడ్ మొదలైనవి ఉన్నాయి. కనుక దేశానికి తెలంగాణా రాష్ట్రం ఇచ్చే డబ్బు ఎంత? తిరిగి కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి ఇచ్చేదెంత? అనే లెక్కలు తెలంగాణా అమిత్ షాగారు తెప్పించుకొని ఒకసారి అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది.
తెలంగాణా రాష్ట్రం నుంచి 2016-17 సం.లలో కేంద్రానికి వెళ్ళిన డబ్బు : ఆదాయపన్ను: రూ. 32,180 కోట్లు, సర్వీస్ టాక్స్: రూ.7,671 కోట్లు, కస్టమ్స్ డ్యూటీ: రూ.3,328 కోట్లు, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ: రూ.6,828 కోట్లు. అన్నీ కలిపి మొత్తం రూ.50,013 కోట్లు.
ఇక అదే 2016-17 సం.లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన డబ్బు మొత్తం రూ. 24,561. రాష్ట్రంలో హైవే రోడ్స్ ప్రాజెక్టులతో సహా అన్ని ప్రాజెక్టులకు కలిపి కేంద్రం ఇచ్చిన డబ్బు ఇది. అంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళుతున్న దానిలో సగం కూడా మనకు ఇవ్వలేదన్నమాట. ఇది నేను చెప్పిన లెక్కలు కావు. వీటిని కేంద్రప్రభుత్వమే దృవీకరించింది.
దేశానికి అవసరమైన నిధులు అందిస్తున్నందుకు మనం గర్వపడాలి తప్ప బాధపడనవసరం లేదు. కానీ రాష్ట్రానికి కేవలం రూ. 24,561 కోట్లు మాత్రమే ఇచ్చి అమిత్ షా వంటి పెద్దలు మనకు లక్ష కోట్లు ఇచ్చామని చెప్పుకోవడమే బాధ కలిగిస్తోంది. ఇప్పటికైనా అయన ఆర్ధికశాఖ నుంచి ఈ లెక్కలు రప్పించుకొని అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది,” అన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్.