తాజా తాజ్ బాదుడు

ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆగ్రాలోని తాజ్ మహల్ ను చూసేందుకు నిత్యం దేశవిదేశాల నుంచి వేలాదిమంది సామాన్యులు, ప్రముఖులు వస్తుంటారు. తాజ్ మహల్ నిర్వహణ కోసం వారి వద్ద నుంచి మనిషికి రూ.40 చొప్పున ప్రవేశఫీజ్ వసూలు చేసేవారు తాజ్ నిర్వాహకులు. ఏప్రిల్ 1వ తేదీ నుండి దానిని రూ.50కు పెంచారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు. కానీ తాజ్ మహల్ లోని ముంతాజ్ సమాధిని చూసేందుకు ఏప్రిల్ 1 నుంచి మనిషికి రూ.200  ప్రత్యేక ఫీజును, అదే విదేశీ పర్యాటకులకైతే రూ.1,250 వసూలు చేయాలని నిర్ణయించామని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ తెలిపారు. తద్వారా తాజ్ మహల్ నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడమే కాకుండా, తాజ్ మహల్ లో రద్దీని కూడా నియంత్రించవచ్చని అన్నారు.