సినిమాలలో మల్టీ స్టార్ సినిమాలు వెరీ స్పెషల్...వాటికుండే క్రేజే వేరు. కనుక వాటిలో చేయడానికి సినీ తారలు కూడా చాలా ఇష్టపడుతుంటారు. సినీతారలు రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చినప్పటికీ రాజకీయాలలో ‘మల్టీ స్టార్ పార్టీలు’ పెద్దగా హిట్ అవలేదు. అందుకే సినీ తారలు ఏదో ఒక పార్టీలో చేరడమో లేక ఎవరి పొయ్యి వారు పెట్టుకోవడమో చేస్తుంటారు.
తమిళనాడులో కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ఇంచుమించు ఒకేసమయంలో రాజకీయాలలోకి ప్రవేశించడానికి సిద్దం అవుతున్నారు. ఇద్దరూ వేర్వేరుగా పార్టీలు పెట్టుకొని ప్రజల ముందుకురావడం వలన, ప్రజల ఓట్లు చీఎలిపోయి ఇద్దరూ నష్టపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. అందుకే ఇద్దరూ కలిసి పనిచేస్తే వారికి మద్దతు ఇస్తామని తమిళ సినీపరిశ్రమ స్పష్టం చేసింది. కమల్ హాసన్ కూడా రజనీకాంత్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు కానీ అయన మతతత్వ పార్టీ (భాజపా)తో చేతులు కలపాలనుకొంటే మాత్రం ఆయనకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.
ఒకవేళ కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరూ ఎలాగో కలిసి పనిచేసినా ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లుగా అన్ని విధాలుగా సముజ్జీలైన వారి మద్య భేదాభిప్రాయాలు కలగి విడిపోవడం ఖాయం. కనుక వారిరువురు కలిసి పనిచేసినా...లేదా విడివిడిగా పనిచేసినా ఇద్దరూ లేదా ఇద్దరిలో ఒకరు రాజకీయాలలో ఎదురుదెబ్బలు తిని అప్రదిష్టపాలయ్యే అవకాశాలే ఎక్కువ.