ఇలాంటి జోకర్లవలననే ఏపి నవ్వులపాలు: వర్మ

ఒక రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు ధర్నాలు, సభలు నిర్వహిస్తుంటాయి. అదే అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలు తమ ఎంపిలు, మంత్రులు, ఉన్నతాధికారుల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళుతుంటాయి. 

కేంద్రబడ్జెట్ లో ఏపికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపి ఎంపిలు పార్లమెంటు లోపల బయటా నిరసనలు తెలియజేశారు. అయితే వారిలో రకరకాల వేషాలువేసే అలవాటున్న తెదేపా ఎంపి శివప్రసాద్ రోజుకో వేషంతో తనదైన శైలిలో నిరసన తెలియజేస్తున్నారు. 

ఆయన వేషాలపై దర్శకుడు రాం గోపాల్ వర్మ స్పందిస్తూ, “ఏపికి ప్రతినిధులుగా ఎన్నికైన ఇటువంటి జోకర్ల కారణంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఏపి సమస్యలను జోక్ గా తీసుకొంటే ఆశ్చర్యం లేదు. వారు జోకర్లకు తక్కువ ‘....’కు ఎక్కువ అని ట్వీట్ చేశారు.   

ఒక తీవ్రమైన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళడానికి అందుకు అనుగుణమైన పద్దతులనే అనుసరించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. కానీ ఎంపి శివప్రసాద్ కి రకరకాల వేషాలు వేయాలనే కోరికను ఈవిధంగా తీర్చుకొనే ప్రయత్నం చేస్తుండటం వలన వర్మ చెప్పినట్లుగా అందరికీ అది నవ్వులాటగానే ఉంటుంది. ఇటువంటి వేషాలతో ఏపి సమస్యలు తీరకపోగా డిల్లీలో ఏపి రాష్ట్రం పరువుపోతోందని ప్రజలే భావిస్తున్నారు. ఒక ఎంపిగా ఎంతో హుందాగా మెలగవలసిన శివప్రసాద్ బిచ్చగాడిలా, హరిదాసులాగ, కాటికాపరిలాగ వేషాలు వేస్తుంటే, ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఆయనను వారించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ ఎంపి విషయంలో రాం గోపాల్ వర్మ అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తారనడంలో సందేహం లేదు.