ఖమ్మం నగరానికి సరికొత్త ఆకర్షణగా అందంగా అభివృద్ధి చేయబడిన ‘లకారం టాంక్ బండ్’ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం తానా, పువ్వాడ ఫౌండేషన్ సంయుక్తంగా 5కే రన్ నిర్వహించారు. నగరంలో సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లకారం స్టేడియం వరకు సాగిన ఈ ‘రన్ ఫర్ ఖమ్మం’ 5కే రన్ లో సుమారు 15,000 మందికి పైగా స్థానిక ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ 5కే రన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక చక్కటి పాటకు అందరూ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
ఈ కార్యక్రమానికి సినీ తారలు హేమ, అనిత చౌదరి, శ్రీకాంత్, శివాజీ రాజా, శ్రీనివాస్ రెడ్డి, తారక్, సురేష్ అనితా చౌదరి, రవిబాబు, ఉత్తేజ్, శివ, గౌతంరాజు, సింహా తదితరులు హాజరయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జెండా ఊపి 5కే రన్ ప్రారంభించారు. ఆయనతో సహా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక పోలీస్ శాఖతో సహా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.