కేంద్రమంత్రికి రేణుకా చౌదరి నోటీసు

ప్రధాని నరేంద్ర మోడీ మొన్న పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి పకపకానవ్వారు. అప్పుడు ప్రధాని మోడీ ఆమెను ఉద్దేశ్యించి, “ఆమెను నవ్వనివ్వండి..చాలా కాలం తరువాత మళ్ళీ రామాయణం సీరియలోని అటువంటి నవ్వు వినే అవకాశం లభించింది,” అని చమత్కరించారు. అందుకు సభలో నవ్వులు విరబూసాయి. మహిళనైన తనపై ప్రధాని మోడీ అవహేళనగా మాట్లాడినందుకు ఆమె చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రధాని మోడీ రామాయణంలో ఎవరి పేరును నిర్దిష్టంగా చెప్పకపోవడం వలన పెద్ద సమస్య కాలేదు. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, ఆమె ఫోటోను పక్కనే రామాయణం సీరియల్ లో శూర్పణక ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో రేణుకా చౌదరికి పుండు మీద కారం చల్లినట్లయింది. అందుకే ఆమె ఈరోజు కిరెన్ రిజిజు నోటీసు జారీ చేశారు. మహిళా సభ్యురాలైన తనను ప్రధాని మోడీ అవహేళన చేసినందుకు రాజ్యసభలో హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.