నేడు రాష్ట్రపతిని కలవనున్న కేటిఆర్

ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు హైదరాబాద్ లో వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు జరుగబోతోంది. దాని ముగింపు కార్యక్రమానికి రావలసిందిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరేందుకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటిఆర్ శుక్రవారం ఉదయం 10.30 గంటలకు యనను కలువబోతున్నారు. అనంతరం డిల్లీలో నాస్కాం ప్రతినిధులతో సమావేశమవుతారు.  

మంత్రి కేటిఆర్ గురువారం కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమార్, ధర్మేంద్ర ప్రధాన్ లను కలిశారు. ముందుగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి 2018-19 బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్స్ లో ఒకటి హైదరాబాద్ కు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ లో ఇప్పటికే ఆ రంగానికి సంబంధించిన పరిశ్రమలు, సంస్థలు పనిచేస్తున్నాయని, కనుక రక్షణ ఉత్పత్తుల కారిడార్ ను కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లయితే సమగ్రంగా ఉంటుందన్నారు. 

అనంతరం కేంద్ర గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ ను కలిసి ఈనెల 14 నుంచి 19 వరకు ఫిక్కీ ఆధ్వర్యంలో జరుగబోయే అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు ప్రారంభోత్సవానికి రావలసిందిగా కోరారు. 

ఆ తరువాత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్ష వర్ధన్ ను కలిసి హైదరాబాద్‌లో నెలకొల్పబోతున్న ఫార్మాసిటీ ప్రత్యేకతల గురించి వివరించి దానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సు ముగింపు కార్యక్రమానికి రావలసిందిగా ఆయనను కేటిఆర్ ఆహ్వానించారు. కేటిఆర్ తో పాటు తెరాస ఎంపిలు కూడా కేంద్రమంత్రిని కలిసారు.