హైదరాబాద్ లోని వెరిజాన్ డేటా సర్వీసస్ సంస్థలో పనిచేస్తున్న 52 మంది ఐటి ఉద్యోగులను, ఆ సంస్థ బౌన్సర్లను పెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించిన సంగతి బహుశః చాలా మందికి గుర్తుండే ఉంటుంది. వారు లేబర్ కమీషనర్ కు తమ గోడు మోరపెట్టుకొని న్యాయం చేయాలని కోరినప్పటికీ, స్పందన లేకపోవడంతో వారు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఆ సంస్థ బలవంతంగా రాజీనామాలు చేయించి బయటకు పంపిందని, లేబర్ కమీషనర్ కు విన్నవించుకొన్నా స్పందన రాలేదని కనుక తమకు న్యాయం చేయవలసిందిగా వారు తమ పిటిషన్ ద్వారా హైకోర్టును కోరారు.
వారి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు దానిపై బుధవారం విచారణ జరిపి, లేబర్ కమీషనర్ కు నోటీసు పంపింది. బలవంతంగా తొలగించబడిన ఆ ఉద్యోగులు అందరినీ మళ్ళీ తక్షణమే ఉద్యోగాలలోకి తీసుకొనేందుకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా కమీషనర్ ను ఆదేశించింది. అనంతరం ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది.