నేడు ఏపి బంద్

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించనందుకు నిరసనగా అధికార తెదేపా, ప్రతిపక్షాలు నేడు రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్, వైకాపా, వామపక్షాలు బంద్ కు పిలుపునివ్వగా, ప్రజజీవనానికి ఆటంకం కలిగించే ఇటువంటి ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటామని చెప్పుకొన్న జనసేన కూడా బంద్ కు మద్దతు పలకడం విశేషం. రాష్ట్రంలో ప్రజాజీవనం సాఫీగా సాగేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ అధికారంలో ఉన్న పార్టీ కూడా బంద్ కు పిలుపునివ్వడం విశేషం.

రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ పార్లమెంటులో తమ సభ్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలపడానికి బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెదేపా పేర్కొంది. అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నప్పుడు, తాము చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొంటే అవి తెదేపాను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రమాదం ఉందనే భయంతోనే తెదేపా కూడా వేరే సాకుతో బంద్ కు పిలుపునిచ్చినట్లు భావించవచ్చు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలన్నీ కలిసి బంద్ కు పిలుపునివ్వడంతో ఈరోజు తెల్లవారుజాము నుంచే రాష్ట్రం స్తంభించిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కళాశాలలు, షాపింగ్ మాల్స్ వగైరా తెరుచుకోకపోవచ్చు. ఎన్నికలు దగ్గర పడేవరకు దాదాపు నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు కన్నీళ్లు కార్చుతుండటం హాస్యాస్పదంగా ఉంది.