ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితమే పార్లమెంటులో 2018-19 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ విలువ రూ.24,42,213 కోట్లు. దానిలో మూలధన వ్యయం రూ.7,78,712 కోట్లు. కేంద్రప్రభుత్వ పధకాలు, దాని అధీనంలో ఉండే వివిధ శాఖలు, వివిధ ప్రాజెక్టుల కోసం రూ.7,08,934 కోట్లు కేటాయించారు. వడ్డీల చెల్లింపులు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.5,75,975 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్ హైలైట్స్ ఇవే:
1. గ్రామీణ పారిశుద్యానికి రూ.16,713 కోట్లు.
2. ఆరోగ్య రంగానికి రూ.1.38 లక్షల కోట్లు.
3. గ్రామీణ వ్యవసాయ మార్కెట్ల నిర్మాణం, అభివృద్ధికి రూ.2,000 కోట్లు.
4. వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు.
5. చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపనకు రూ.3,790 కోట్లు.
6. దళితుల సంక్షేమానికి రూ.56,000 కోట్లు.
7. జన్ ధన్ యోజనలో 60,000 కోట్ల బ్యాంక్ ఖాతాలకు భీమా సౌకర్యం వర్తింపు.
8. దేశవ్యాప్తంగా పచ్చదనం పెంచడం కోసం ‘ఆపరేషన్ గ్రీన్’ పధకం ప్రారంభం. దానికి రూ. 500 కోట్లు.
9. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు రూ.1,400 కోట్లు.
10. మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖలకు రూ.10,000 కోట్లు.
11. జాతీయ వెదురు పరిశ్రమలకు రూ.1,290 కోట్లు.
12. ఉజ్వల యోజన పధకం క్రింద 8 కోట్ల మంది గ్రామీణ మహిళలకు గ్యాస్ కనెక్షన్స్.
13. జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750 కోట్లు.
14. ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు రూ.1,200 కోట్లు.
15. విద్యారంగంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి రూ.1 లక్ష కోట్లు.
16. రూ.330 ప్రీమియంతో పేదలకు రూ.5 లక్షల ఆరోగ్యభీమా పధకం. దీని క్రింద 10 కోట్ల మంది పేదలకు వర్తింపజేయబోతున్నారు.
17. క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600 కోట్లు.
18. దేశంలో ప్రతీ మూడు లోక్ సభ నియోజకవర్గాలకు ఒక ప్రభుత్వం కళాశాల ఏర్పాటు.
19. దేశంలో కొత్తగా 24 వైద్య కళాశాలలకు అనుమతి మంజూరు.
20. దేశంలో ప్రతీ పౌరుడికి చేరువగా ఉండేవిధంగా వెల్ నెస్ సెంటర్ల ఏర్పాటు.
21. ప్రధాని సౌభాగ్య పధకానికి రూ. 16,000 కోట్లు. ఈ పధకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది పేదల గృహాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు.