తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరధ ప్రాజెక్టు నుంచి ఈ నెల 5వ తేదీ నుంచే రాష్ట్రంలో అన్ని గ్రామాలకు దశలవారీగా నీళ్ళు అందించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. బుధవారం సచివాలయంలో ఈ ప్రాజెక్టు వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఈ పధకం క్రింద మొత్తం 300 పంపింగ్ స్టేషన్లలో 1,124 పంపుసెట్లు ఏర్పాటు చేయబడ్డాయి. నిన్న జరిగిన సమావేశంలో ఒక్కో పంపింగ్ స్టేషన్ వారీగా జరుగుతున్న పనులను, పెండింగ్ పనులను సమీక్షించి, వాటిలో ముందుగా పూర్తిచేయగల పనులను గుర్తించారు. వాటిని యుద్దప్రాతిపదికన పూర్తిచేసి నీటిసరఫరాకు సిద్దం చేయాలని ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రభావిత నియోజకవర్గాలైన మునుగోడు, దేవరకొండ గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు ఫిబ్రవరి 12న ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి అందరూ గట్టిగా కృషి చేయాలని, పనులు చేయడంలో అశ్రద్ధ, నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడానికి ప్రభుత్వం వెనుకాడదని సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ స్పష్టం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేసి నీళ్ళు అందించడానికి అవసరమైతే అదనంగా కార్మికులను నియమించుకోవడానికి అధికారులు కాంట్రాక్టర్లకు సహాయసహకారాలు అందించాలని కోరారు.