నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి. ఈరోజు రాష్ట్రపతి ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. అనంతరం ‘ఎకనామిక్ సర్వే’ నివేదికను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాలు రెండువిడతలలో జరుగుతాయి. నేటి నుంచి మొదలయ్యే మొదటి విడత సమావేశాలు ఫిబ్రవరి 9వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెడతారు. మళ్ళీ మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 6 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఒకవేళ ఈ ఏడాది నవంబర్-డిశంబర్ నెలలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగేమాటయితే, ఈ ప్రభుత్వానికి ఇదే ఆఖరు బడ్జెట్ అవుతుంది.
కనుక ఎన్నికల ముందు ప్రవేశపెట్టబోతున్న ఈ బడ్జెట్ లో దేశంలో అన్ని వర్గాల ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి మోడీ సర్కార్ అనేక వరాలు ప్రకటించవచ్చని ఆశించవచ్చు. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా ఈ బడ్జెట్ సమావేశాలలోనే ఆమోదింపజేసుకోవడానికి గట్టిగా ప్రయత్నించవచ్చు.