ఆమ్రపాలి మేడం ఏమిటిది?

ఉభయ వరంగల్ జిల్లాల కలెక్టర్ ఆమ్రపాలి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. అతితక్కువ సమయంలోనే, తన అద్భుతమైన పనితీరుతో అటు జిల్లా ప్రజల నుంచి, ఇటు ప్రభుత్వ పెద్దల నుంచి ప్రశంశలు అందుకొన్నారు. కానీ గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా జెండా వందనం చేసిన తరువాత ఆమె ప్రసంగించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగులో వ్రాసిన ప్రసంగా పాఠం చదవడంలో తడబాటు, గణాంకాలను చెప్పడంలో తడబాటు, అవి చదవలేకపోతున్నందుకు ముసిముసినవ్వులు చిందించడం, మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాల గురించి చెప్పవలసినప్పుడు పక్కున నవ్వి ‘ఇటీస్ ఫన్నీ’ అనడం, మధ్యమధ్యలో ప్రసంగం నిలిపివేసి వెనక్కు తిరిగ్గి అధికారులతో మాట్లాడటం...వంటి ఆమె చర్యలతో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని..దానిలో ఒక ముఖ్యమైన ప్రసంగాన్ని  ‘కామెడీ షో’గా మార్చేశాయంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


కలెక్టర్ హోదాలో ఉన్న ఆమె అటువంటి సందర్భంలో ఎంతో హుందాగా వ్యవహరించాలి కానీ ఆమె అందుకు భిన్నంగా ప్రవర్తించారని అందరూ మండిపడుతున్నారు. తెలుగులో వ్రాయబడిన ప్రసంగ పాఠం చదవలేక, తడబడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ప్రసంగించాలి కానీ ఆమె ముసిముసినవ్వులు చిందించారు. మద్యలో ప్రసంగం నిలిపివేసి వెనక్కు తిరిగి అధికారులతో ఏదో మాట్లాడారు. కనుక సహజంగానే అందరూ ఆమెను తప్పు పడుతున్నారు. తెలుగులో వ్రాసిన ప్రసంగాన్ని చదవలేననుకొన్నప్పుడు ప్రోటో కాల్ ప్రకారం ఆ బాధ్యతను వేరొకరికి అప్పగించి ఉండి ఉంటే గౌరవంగా ఉండేది కదా.

(వీడియో: ఆంధ్రజ్యోతి సౌజన్యం)