శ్రీనివాస్ ను హత్య చేయించింది తెరాస ఎమ్మెల్యే: కాంగ్రెస్

 నల్లగొండ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేయించింది తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశం అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, వి. హనుమంతరావు, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు అందరూ శుక్రవారం నల్లగొండకు వచ్చి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెరాస సర్కార్ హత్యారాజకీయలు చేయిస్తోందని ఆరోపించారు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “బొడ్డుపల్లి శ్రీనివాస్ ను హత్య చేసిన ఇద్దరు నిందితులు రాంబాబు, మల్లేష్ యాదవ్ లు తెరాస ఎమ్మెల్యే వేముల వీరేశంకు ప్రధాన అనుచరులు. ఇదిగో..వారు ముగ్గురూ కలిసి దిగిన ఫోటో. శ్రీనివాస్ ను ఎమ్మెల్యే హత్య చేయించారనడానికి ఇదే నిదర్శనం. ఎమ్మెల్యే తమ్ముడు అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తూ రెండుసార్లు జైలుకు వెళ్ళాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి జిల్లాలో తెగ రెచ్చిపోతున్నారు. వారి నేర చరిత్ర గురించి ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలియదా? అయినా ఎందుకు వారిరువురిపై చర్యలు తీసుకోవడం లేదు? వారిరువురు శ్రీనివాస్ ను తెరాసలో చేరాలని చాలా కాలంగా ఒత్తిడి చేస్తున్నారు...బెదిరిస్తున్నారు. కనుక ఎమ్మెల్యే నుంచి శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని, భార్యభార్తలిద్దరికీ రక్షణ కల్పించాలని మేము స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ని కోరినప్పటికీ అయన పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే చేతిలో శ్రీనివాస్ హత్య చేయబడ్డాడు. ఇప్పుడు శ్రీనివాస్ హత్యకు ముఖ్యమంత్రి కెసిఆర్ భాద్యతవహిస్తారా? ముమ్మాటికీ ఇది తెరాస హత్యారాజాకీయమే. కాదంటే ఈ కేసును ప్రభుత్వం సిబిఐకు అప్పగించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి,” అన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మేము కూడా తెరాస పంధాలోనే సాగితే తెరాసలో ఒక్కడూ మిగలడు. కానీ అధికారం కోసం మేము హత్యారాజకీయలు చేయము. మా పార్టీ గాంధేయ సిద్దాంతం పాటిస్తుంది. అందుకే తెరాస అరాచకాలను మేము మౌనంగా భరిస్తున్నాము. కానీ అంతమాత్రన్న మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాను. ఈ హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులపై ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు తీసుకోకపోతే నేను హైకోర్టుకు వెళతాను.

కె జానారెడ్డి మాట్లాడుతూ, “జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలోపేతం అవుతుండటంతో కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకే తెరాస ఇంత నీచానికి పాల్పడింది. శ్రీనివాస్ కాల్ డేటాను బయటపెడితే ఆయనను ఎవరు హత్య చేశారో బయటపడుతుంది. అధికారం కోసం హత్యారాజకీయాలకు దిగడం సరికాదు,” అన్నారు.

వి. హనుమంతరావు మాట్లాడుతూ, “జిల్లాకు నయీం పీడ విరగడయిందనుకొంటే మళ్ళీ ఈ ఎమ్మెల్యే తయారయ్యాడు. అతను కూడా జిల్లాలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని ఉపేక్షించడం సరికాదు. తక్షణమే అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి,” అన్నారు.