నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితులు

నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో పట్టణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శ్రీనివాస్ హత్యకు నిరసనగా ఈరోజు జిల్లా బంద్ కు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.    హతుడు శ్రీనివాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అనుచరుడు కావడంతో అయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పట్టణంలో క్లాక్ టవర్ జంక్షన్ వద్ద కూర్చొని నిరసన తెలియజేస్తున్నారు. 

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే. దీనిలో అధికార తెరాస నేతల హస్తం ఉందని నిరూపించేందుకు నా వద్ద బలమైన సాక్ష్యాధారాలున్నాయి. జిల్లా ఎస్పి తెరాస ఏజంట్ లాగ వ్యవహరించడం మానుకొని ఈ హత్య వెనుక ఉన్నవారిని అందరినీ అరెస్ట్ చేయాలి,” అని డిమాండ్ చేశారు. 

కోమటిరెడ్డికి నచ్చజెప్పి ధర్నా విరమింపజేయడానికి పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం శ్రీనివాస్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది కనుక అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎక్కడికక్కడ పట్టణమంతా బారీగా పోలీసులను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఉద్రిక్తవాతావరణం నెలకొని ఉంది.