రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయంగా సీపీఐ (ఎం) నేతృత్వంలో 21 పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి ‘బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బి.ఎల్.ఎఫ్.)ను ఏర్పాటు చేయబోతున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని ఎల్.బి.నగర్ లో ఎంవి రెడ్డి ఫంక్షన్ హాల్ లో బి.ఎల్.ఎఫ్. ఆవిర్భావసభ జరుగబోతోంది. దీనికి సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్, ఈ కూటమిలో భాగస్వామ్య పార్టీల, ప్రజా సంఘాల నేతలు హాజరుకాబోతున్నారు. కాంగ్రెస్, తెరాస, తెదేపా, భాజపా పార్టీలన్నీ ఒక తానులో ముక్కలేనని వాటిలో ఏది అధికారంలో ఉన్న రాష్ట్రానికి, ప్రజలకు చేసేదేమీ ఉండదని సీపీఐ (ఎం) బహుజన రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నల్లా సూర్యప్రకాష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రధాన అజెండాగా ఈ కూటమి అవిర్భావిస్తోందని సూర్యప్రకాష్ చెప్పారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అన్ని లోక్ సభ, శాసనసభ స్థానాలకు తమ కూటమి పోటీ చేస్తుందని తెలిపారు.