నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ బుధవారం రాత్రి హత్యకు గురయ్యారు. పట్టణంలో అయన ఉంటున్న సావర్కర్ నగర్ లో రాత్రి 11 గంటలకు కొందరు వ్యక్తులు గొడవపడుతున్నట్లు తెలియడంతో శ్రీనివాస్ అక్కడకు చేరుకొని వారికి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ వారు కోపోద్రేకంతో శ్రీనివాస్ తలపై బండరాయితో గట్టిగా కొట్టి చంపేశారు. అనంతరం శ్రీనివాస్ ను హత్య చేసినవారు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయారు. శ్రీనివాస్ అంటే గిట్టనివారు ఎవరో అయనను హత్య చేయడానికే ఈ నాటకం ఆడి ఉండవచ్చని అయన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. చనిపోయిన శ్రీనివాస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅనుచరుడు. ఈ సమాచారం తెలుసుకొన్న వెంటనే అయన హైదరాబాద్ నుంచి నల్లగొండ చేరుకొని శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి అతని కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు.