రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఊహించినట్లుగానే తెరాస, జనసేనలను ముడిపెడుతూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రొఫెసర్ కోదండరాం యాత్రలకు అనుమతి నిరాకరిస్తున్న తెరాస సర్కార్, పవన్ కళ్యాణ్ ను ఎందుకు అనుమతిస్తోంది? అని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
“రాష్ట్రంలో యువతను కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి తెరాసవైపు మళ్ళించడానికే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు’ అని మరో కాంగ్రెస్ నేత అన్నారు.
భాజపా అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు హైదరాబాద్ లో నిన్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎవరినీ పాదయాత్రలకు, సభలు పెట్టుకోవడానికి అనుమతించని ముఖ్యమంత్రి కెసిఆర్, పవన్ కళ్యాణ్ ను అనుమతించడం గమనిస్తే, భవిష్యత్ లో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయబోతున్నాయని అర్ధం అవుతోంది. మరోవిధంగా చెప్పాలంటే తెరాసకు జనసేన ‘బి’ టీమ్ వంటిది. అది తెరాస కోసమే పనిచేస్తుంది. ఒకప్పుడు తెలంగాణా రాష్ట్రా ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణాపై కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. అయితే ప్రజలకు అంత మతిమరుపు లేదనే సంగతి అయన మరిచిపోతున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘ప్యాకేజి రాజకీయాల’ను అక్కడ ఏపిలో ప్రజలు తిరస్కరించారు. ఇక్కడి ప్రజలు కూడా తిరస్కరించడం ఖాయం. తాను ప్రభుత్వాలను ప్రశ్నించడానికే వచ్చానని చెప్పుకొంటున్న పవన్ కళ్యాణ్ ను అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చక్కగా ఉపయోగించుకొంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉపయోగించుకోబోతున్నారు. ఎన్నికలలో తమ రాజకీయ ప్రత్యర్ధులను చీల్చడానికి ఈ ‘ఎన్నికల నిపుణుడి’ సేవలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చక్కగా వినియోగించుకొంటారని చెప్పగలను. నిర్దిష్టమైన విధివిధానాలు ఏవీ లేని ఇటువంటి అవకాశవాద రాజకీయ నాయకులను, పార్టీలను ప్రజలు ఎన్నడూ ఆదరించరు,” అని అన్నారు.