పవన్ యాత్రతో కాంగ్రెస్ ఉలికిపాటు...దేనికి?

సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మళ్ళీ చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చారు. “ఒకపక్క  కొండగట్టు ఆలయానికి బారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం ఎందుకు అనుమతించింది? ముఖ్యమంత్రి కెసిఆర్, పవన్ కళ్యాణ్ కుమ్మక్కు అయ్యారు,” అని ఆరోపించారు. 

పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషిస్తారు..వ్యతిరేకిస్తారని, ఆ కారణంగా తన తండ్రి వంటి అన్నయ్య చిరంజీవిని వ్యతిరేకించడానికి కూడా వెనుకాడలేదని అందరికీ తెలిసిందే. అయన ఏపిలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తే, తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి నష్టం, అభ్యంతరం ఏమీ ఉండకపోవచ్చు కానీ వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెపుతున్నారు కనుక దాని వలన ఓట్లు చీలితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే తెరాస-తెరాసల మధ్య తెర వెనుక ఏదో జరుగుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ విజయవకాశాలకు గండి పడుతుంది. బహుశః అందుకే కాంగ్రెస్ నేతలు అప్పుడే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పాట మొదలుపెట్టేశారేమో? నిజానికి ఇటువంటి సందర్భాలలో ఎప్పుడూ ముందుగా తెరాస అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటుంది కానీ ఈసారి దాని కంటే ముందు కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం దాని అభద్రతాభావానికి అద్దం పడుతోంది. ఈ అనుమానమే నిజమైతే బహుశః నేటి నుంచి మిగిలిన కాంగ్రెస్ నేతలు కూడా పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించినా ఆశ్చర్యం లేదు.