కలెక్టర్ ఆమ్రపాలికి కోర్టు షాక్!

వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లాల కలెక్టర్ ఆమ్రపాలికి వరంగల్ రెండో అదనపు కోర్టు షాక్ ఇచ్చింది. స్థానిక ఐసిడిఎస్ కార్యాలయానికి స్వంత భవనం లేకపోవడంతో అద్దెభవనంలో కొనసాగుతోంది. అయితే గత రెండేళ్ళుగా దానికి అద్దె చెల్లించకపోవడంతో అది మొత్తం రూ.3 లక్షలకు చేరుకొంది. అద్దె చెల్లించవలసిందిగా కోరుతూ ఆ భవనం యజమాని కృష్ణారెడ్డి ఎన్నిసార్లు నోటీసులు ఎవరూ స్పందించకపోవడంతో, అతను  కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వం నుంచి తనకు రావలసిన అద్దె మొత్తాన్ని తక్షణం చెల్లింపజేయాలని పిటిషనులో కోరారు. దానిపై విచారణ చేపట్టిన రెండో అదనపు కోర్టు న్యాయమూర్తి కలెక్టర్ ఆమ్రపాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, ఆమె అధికార వాహనం (ఫార్చూనర్ కారు)ను స్వాధీనం చేసుకొని, అద్దె బకాయిని పూర్తిగా చెల్లించిన తరువాతే కారును తిరిగి ఈయవలసిందిగా ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే కోర్టు సిబ్బంది ఆమె కార్యాలయానికి చేరుకొని ఆమె ఉపయోగిస్తున్న కారును స్వాధీనం చేసుకొన్నారు.