పండగ సంబరాలతో పెరేడ్ గ్రౌండ్స్ కళకళ

తెలంగాణా రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖల అధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆది, సోమవారం రెండు రోజులపాటు స్వీట్స్ ఫెస్టివల్, కైట్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతోంది. తెలంగాణాతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల పండగ పిండివంటలు, ఆయా రాష్ట్రాలకే ప్రత్యేకమైన మిఠాయిలు ప్రదర్శించుతున్నారు. అలాగే మరోపక్క దేశవిదేశాల నుంచి వచ్చిన పతంగుల నిపుణులు ఎగురవేస్తున్న రంగురంగుల, రకరకాల పతంగులు కనువిందు చేస్తున్నాయి. 




ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయలన్నిటికీ సంక్రాంతి పండగ శలవులు ప్రకటించడంతో ఆదివారం ఒక్కరోజే సుమారు 1.50 లక్షల మంది ప్రజలు ఈ పండగ సంబురాలలో పాల్గొన్నారు. ఈ స్వీట్ ఫెస్టివల్ లో బ్రెజిల్, ఆఫ్ఘనిస్థాన్, తైవాన్, థాయ్‌లాండ్‌ తదితర దేశాల నుంచి వచ్చిన అతిధులు కూడా తమతమ దేశాలకు చెందిన మిఠాయిలను ప్రదర్శించారు.   


హైదరాబాద్ లో స్థిరపడిన మరాఠీ, సింధీ, గుజరాతీ, పంజాబీ, రాజస్థానీ, బెంగాలీ, బిహారీ, కన్నడ, తమిళ్, ఆంధ్రా, ఒడియా తదితర రాష్ట్రాల ప్రజలు ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధిచెందిన మిఠాయిలు, పిండివంటలు వండి తీసుకువచ్చి అతిధులకు అప్యాయంగా రుచి చూపించారు. ఒకేసారి ఒకే ప్రాంతంలో ఇన్ని రాష్ట్రాల ప్రజలను చూస్తే పెరేడ్ గ్రౌండ్స్ ఒక ‘మినీ ఇండియా’ లాగ కనిపిస్తోంది. 


ఒకపక్క నేతి మిఠాయిలు గుమగుమలు పరేడ్ గ్రౌండ్స్ అంతటా వ్యాపించి నోరూరిస్తుంటే, మరోపక్క వివిద రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన పతంగుల నిపుణులు పోటీలుపడి పతంగులు ఎగురవేస్తుంటే కనువిందు చేశారు. వాటిని చూసి పిల్లలు, యువత, మహిళలు, పెద్దలు అందరూ చాలా ఆనందించారు. 


ఇదివరకు బతుకమ్మ పండగ జరిగినప్పుడు నగరంలో అచ్చమైన తెలంగాణా సంస్కృతి కనువిందు చేస్తే, ఇప్పుడు బలమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే అచ్చమైన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు కనువిందు చేస్తున్నాయి. విదేశీ అతిధులరాకతో అది మరింత శోభాయమానంగా మారింది. ‘వసుధైక కుటుంబం’ అంటే ఇదేనేమో అనిపిస్తోంది. ఇటువంటి గొప్ప సంస్కృతికి, సహనశీలత, ప్రేమాభిమానాలకు నిలయం గనుకనే ‘మేరా హైదరాబాద్...మేరా భారత్ మహాన్’ అని గర్వంగా చెప్పుకొందాం.