క్యాబినెట్ లో ఉద్యమద్రోహులు...వాళ్ళతో తిప్పలు

మహబూబ్ నగర్ తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అయన విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెపుతూ, “మంత్రివర్గంలో తెలంగాణా ఉద్యమద్రోహులు చేరరన్న హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్న మాట నిజమే! ఒకప్పుడు ఉద్యమసమయంలో మాపై రాళ్ళు వేయించినవారే నేడు మంత్రివర్గంలో కీలకపదవులలో ఉన్నారు. నియోజకవర్గంలో పనులు చేయించుకోవడానికి మేము వారినే బ్రతిమాలుకోవలసిరావడం బాధగానే ఉంది కానీ తప్పడం లేదు. రాజకీయ అవసరాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ వారిని మంత్రివర్గంలో తీసుకోవలసి వచ్చిందని మాకు తెలుసు. అందుకే మేము కూడా సర్దుకుపోక తప్పడం లేదు. తెలంగాణా సాధన కోసం పోరాడిన వారికి ఎప్పటికైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి కెసిఆర్ తప్పకుండా వారందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము,” అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణా ఉద్యమాలలో మొదటి నుంచి చురుకుగా పాల్గొన శ్రీనివాస్ గౌడ్ వంటి కొంతమంది తెరాస నేతలు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత తమకు తప్పకుండా మంత్రి పదవులు లభిస్తాయని ఆశించారు. కానీ గౌడ్ చెప్పినట్లుగానే రాజకీయ అవసరాలు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ వారికి అవకాశం కల్పించలేదు. వారికి దక్కవలసిన మంత్రి పదవులు తెదేపా నుంచి వచ్చినవారికి ఇచ్చారు కనుక వారు అసంతృప్తికి లోనవడం సహజమే. తెరాస ఎంపి జితేందర్ రెడ్డి తనకు మంత్రిపదవి రాకుండా అడ్డుపడ్డారని శ్రీనివాస్ గౌడ్ బహిరంగంగానే చెప్పుకొంటుంటారు. ఒకసారి జితేందర్ రెడ్డి సమక్షంలోనే బహిరంగ సభలోనే శ్రీనివాస్ గౌడ్ ఆ మాట అన్నప్పుడు అయన దానిని ఖండించారు. కారణాలు ఏవైనప్పటికీ తెరాస మంత్రివర్గంలో ఉద్యమద్రోహులు మంత్రి పదవులు అనుభవిస్తున్నారనే బాధ తెరాసనేతలలో కార్యకర్తలలో ఉందనే సంగతి శ్రీనివాస్ గౌడ్ మాటలతో మరోసారి బయట పడింది.