గత ఏడాదిలో వరుసగా జరిగిన అనేక రైలు ప్రమాదాలలో అనేకమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని చోట్ల ప్రయాణికుల త్రొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వరుస ప్రమాదాలకు నైతికబాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి, రైల్వేబోర్డు చైర్మన్ రాజీనామాలు చేయవలసి వచ్చింది. అయినప్పటికీ ఏడాది పొడవునా ఏదో ఒక చోట రైల్వే ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కనుక 2017 సంవత్సరం రైల్వే శాఖకు తీరని అప్రదిష్ట తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు.
ఈ సమస్యల పరిష్కారానికి రైల్వేశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. రైల్వే లైన్ల పరిశీలన, వివిధ ప్రాంతాలలో రైల్వే ట్రాక్ లకు జరుగుతున్న మరమత్తుల పరిశీలన, స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ వంటి పనులకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. డ్రోన్ కెమెరాలను కొనుగోలు చేయాలని రైల్వేశాఖ దేశంలో అన్ని రైల్వే జోన్స్ ఉన్నతాధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
మొదట ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్ లో జబల్ పూర్ రైల్వే స్టేషన్ లో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి చూశారు. అక్కడ సత్ఫలితాలు రావడంతో దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్స్ లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వీటితో రైల్వే ఇంజనీరింగ్, సేఫ్టీ మరియు సిగ్నలింగ్ అధికారులు, ఉద్యోగులు తమ కార్యాలయంలో కూర్చొనే రైల్వే ట్రాక్స్ పరిస్థితిని, అక్కడ జరుగుతున్న మరమత్తులను పరిశీలించవచ్చు.
గత ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరిగిన రైల్వే ప్రమాదాలలో కేవలం మానవతప్పిదాల కారణంగానే అనేకమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం అయ్యింది. రైల్వే ట్రాక్స్ నిర్వహణలో అశ్రద్ధ, అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఆ ప్రమాదాలు జరిగాయని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పొగమంచు, తీవ్రమైన చలి లేదా ఎండలు ఉన్నప్పుడు రైల్వే ట్రాక్ ల పరిశీలన, లోపాలున్నవాటిని మరమత్తులు చేయడంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తుంటారు. అదే పెను ప్రమాదాలకు కారణం అవుతుంది. అటువంటి పరిస్థితులలో డ్రోన్ కెమెరాలు చాలా ఉపయుక్తంగా ఉంటాయి.