ఇంతవరకు తెలంగాణాలో కాంగ్రెస్, తెదేపా, వైకాపాల నుంచే ఎక్కువమంది అధికార తెరాసలోకి ఫిరాయించారు. భాజపా నుంచి పెద్దగా ఫిరాయింపులు జరుగలేదు. అలాగే ఇతర పార్టీల నుంచి భాజపాలోకి కూడా పెద్దగా చేరికలు లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ ఇప్పుడు భాజపాలో మొదటి వికెట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.
వరుసగా రెండుసార్లు చెర్యాల నుంచి తెరాస తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, 2009ఎన్నికలలో ఓడిపోయిన తరువాత భాజపాలో చేరారు. కానీ అయన భాజపాలో ఇమడలేకపోతున్న కారణంగా మళ్ళీ తెరాసలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికలలో సిటింగ్ ఎమ్మెల్యేలకే 90 శాతం టికెట్స్ ఇవ్వాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇదివరకే ప్రకటించారు. పైగా తెరాసలోనే చాలామంది టికెట్స్ ఆశిస్తున్నావారున్నారు. కనుక ఒకవేళ ప్రతాప్ రెడ్డి తెరాసలో చేరుతున్నట్లయితే వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి ఆయనకు తెరాస నుంచి టికెట్ కు హామీ లభించిందనే భావించాలేమో?