హైకోర్టు విభజనకు మూడు కమిటీలు

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు ఏర్పడి మూడున్నరేళ్ళు గడిచిపోయిన తరువాత హైకోర్టు విభజన ప్రక్రియకు ఇప్పుడు మెల్లగా పనులు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో గల నాలుగు భవనాలలో హైకోర్టు ఏర్పాటుకు అనువైనదానిని ఎంచుకోవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగరాజన్ కు లేఖ వ్రాయడంతో పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది మేనెలలోగా హైకోర్టు విభజన ప్రక్రియను సజావుగా పూర్తిచేసి తెలంగాణా రాష్ట్రావతరణ దినోత్సవం రోజైన జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలలో వేర్వేరుగా హైకోర్టులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకొని పనులుమొదలుపెట్టారు. ముందుగా దీని కోసం జస్టిస్ రమేష్ రంగరాజన్ న్యాయమూర్తులతో కూడిన మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. వాటిలో భవనాల కమిటీ, సిబ్బంది విభజన కమిటీ, కేసుల విభజన కమిటీలున్నాయి. ఒక్కో కమిటీలో ఐదుగురు న్యాయమూర్తులున్నారు. 

భవనాల కమిటీ సభ్యులు సంక్రాంతి పండుగ తరువాత అమరావతికి వెళ్ళి అక్కడ హైకోర్టు ఏర్పాటుకు ఏపి సర్కార్ ఇవ్వదలచుకొన్న భవనాలను, అక్కడి మౌలిక సదుపాయాలను పరిశీలించి, ఇంకా అవసరమైన ఏర్పాట్లను ఏపి సర్కార్ కు సూచిస్తుంది. మిగిలిన రెండు కమిటీలు కూడా సంక్రాంతి పండుగ తరువాతే కేసులు, ఉద్యోగుల విభజన ప్రక్రియను ప్రారంభిస్తాయి.