అప్పుడే మేడారంలో హడావుడి షురూ

రెండేళ్ళకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోకెల్లా అతిపెద్ద జాతర. దీనికి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ మొదలైన అనేక జిల్లాల నుంచి లక్షలాది మంది గిరిజనులు తరలి వస్తుంటారు. జనవరి 31వ తేదీ నుంచి మేడారం జాతర మొదలవబోతోంది. అయితే ఈసారి మూడు వారాల ముందుగానే మేడారంకు భక్తులు రాక మొదలైపోయింది. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి సమక్క సారక్క అమ్మవార్లను దర్శించుకొని వెళుతున్నారు. దాంతో అప్పుడే మేడారంలో పండుగ వాతావరణం కనబడుతోంది. అయితే జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అవసరమైన త్రాగునీరు, టాయిలెట్స్, తాత్కాలిక వసతి సౌకర్యాలు, విద్యుదీపాలు వంటి ఏర్పాట్లు చాలా మెల్లగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ నుంచి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది కనుక అప్పుడు పనులు జరగడం ఇంకా కష్టం అవుతుంది. కలెక్టర్ మురళి ఇటీవల బదిలీ కావడంతో పనులు జాప్యం అవుతున్నట్లు సమాచారం.