రేవంత్ రెడ్డి ప్రశ్నలకు డాక్టర్ గారి సమాధానం ఏమిటో?

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, శనివారం మళ్ళీ మంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి లక్ష్మారెడ్డి నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకొని డాక్టర్ గా చలామణి అవుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయన డాక్టర్ కాదని నిరూపించడానికి తన వద్ద బలమైన ఆధారాలున్నాయని చెపుతూ, 2004, 2014 ఎన్నికల ఎఫిడవిట్లలో మంత్రి లక్ష్మారెడ్డి ఒకసారి తాను 1988లో గుల్బర్గా యూనివర్సిటీ నుంచి వైద్యవిద్యలో ఉత్తీర్ణులైనట్లు, మరోసారి 1987లో కర్ణాటక యూనివర్సిటీ నుంచి వైద్య విద్యలో ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారని, ఈ రెండింటిలో ఏది నిజమో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

అయితే అయన చెప్పుకొంటున్నవాటిలో గుల్బర్గా యూనివర్సిటీకి 1990లో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి నుంచి అనుమతి లభించిందని, అలాగే కర్ణాటక యూనివర్సిటీకి 1988లో అనుమతి లభించిందని రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులకు సాక్ష్యాధారాలు చూపారు. ఆ రెండు యూనివర్సిటీలకు అనుమతులు లేనప్పుడు లక్ష్మారెడ్డి వైద్యవిద్య ఏవిధంగా అభ్యసించగలిగారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాను చేసిన ఈ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, మంత్రి లక్ష్మారెడ్డికి దమ్ముంటే మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. మరి మంత్రిగారి పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్న ఈ సవాలుపై ఏవిధంగా స్పందిస్తారో లేదో ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.