అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు?

ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో నిన్న వ్యవసాయ రంగంపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం జరిపారు. ఆ సందర్భంగా అయన మరో కొత్త ప్రతిపాదన చేశారు. వరి, పప్పులు, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలతో బాటు మిర్చి, పట్టి, పసుపు వంటి వాణిజ్య పంటలకు, మామిడి, బత్తాయి, నిమ్మ వంటి పండ్ల పంటలకు మార్కెట్లలో గిట్టుబాటు ధరలు కల్పించెందుకు గట్టిగా కృషి చేద్దామని, ఒకవేళ రాకుంటే రైతు సమన్వయ సమితుల ద్వారా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి మార్కెట్లలో విక్రయిద్దామని ప్రతిపాదించారు. రైతులకు మేలు చేకూర్చేందుకు నష్టం భరించవలసి వచ్చినా ప్రభుత్వం అందుకు సిద్దంగా ఉందని అన్నారు. అయితే ముందుగా తెరాస ఎంపిలు వచ్చే పార్లమెంటు సమావేశాలలో వివిధ పంటలకు మద్దతు ధరల గురించి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తారని, ఒకవేళ కేంద్రం సకాలంలో సానుకూలంగా స్పందించనట్లయితే, రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కోరారు. 

ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఈ తాజా ప్రతిపాదనను అధికారులు విజయవంతంగా అమలుచేయగలిగినట్లయితే, వ్యవసాయ మార్కెట్లలో రైతులను మోసం చేస్తున్న దళారులు, వ్యాపారులకు అడ్డుకట్టపడుతుంది. అప్పుడు తప్పనిసరిగా వారు కూడా దిగి వచ్చి రైతులకు గిట్టుబాటుధర చెల్లించడానికి సిద్దపడే అవకాశాలున్నాయి. అయితే వ్యవసాయ, మార్కెటింగ్ ఇంకా సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ఈ ప్రతిపాదనను ఖచ్చితంగా అమలయ్యేలా గట్టిగా కృషి చేయాలి. అందరూ కలిసి కనీసం ఒక్క ఏడాది ఈవిధంగా చేయగలిగితే రైతులకు చాలా మేలు చేసినవారవుతారు.