గవర్నర్- టి కాంగ్రెస్ నేతలు డిష్యూం డిష్యూం!

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు శుక్రవారం రాజ్ భవన్ వెళ్ళినప్పుడు, వారికీ గవర్నర్ నరసింహన్ కు మద్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న కొన్ని విపరీత పరిస్థితుల గురించి ఆయనకు వివరించి విజ్ఞప్తి పత్రం ఈయడానికి వెళ్ళారు.

మందకృష్ణ మాదిగ అరెస్ట్, కామారెడ్డిలో ఇసుక మాఫియా ఆగడాలు, నేరెళ్ళ భాధితుల సమస్యలు మొదలైన అంశాలపై ఒకరి తరువాత ఒకరు గవర్నర్ నరసింహన్ కు వివరించుతుంటే, అయన వారినే తప్పు పట్టడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 

కామారెడ్డిలో చనిపోయింది వి.ఆర్.ఓ. కాదని, అయినా మీరు అక్కడకు ఎందుకు వెళ్ళారని గవర్నర్ నరసింహన్ ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేతలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాజకీయనాయకులమని సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళతామని, శాంతి భద్రతల పరిస్థితి అదుపుతప్పున్నప్పుడు మీరు కలుగజేసుకోరా? అని  ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్, మైనింగ్ శాఖ మంత్రి కేటిఆర్ లపై తీవ్ర విమర్శలు చేయడంతో గవర్నర్ నరసింహన్ వారిని వారించడంతో వారు ఆయనపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సర్వే సత్యనారాయణ కలుగజేసుకొని “మాకు పాఠాలు చెప్పడానికి మీరు టీచరూ కాదు మేము చిన్న పిల్లలమూ కాదు. ముందు మీరు తెరాస ఏజంటులా మాట్లాడటం మానుకోండి. ముఖ్యమంత్రి కెసిఆర్ ని, మంత్రి కేటిఆర్ కు వంతపాడటం మానుకొని మేము చెపుతున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది,” అని తీవ్ర స్వరంతో చెప్పడంతో గవర్నర్ నరసింహన్ కోపంతో ఇక మీతో మట్లాడవలసిందేమీ లేదని లేచి వెళ్ళిపోబోతుంటే, కాంగ్రెస్ నేతలు అయనపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము సమస్యల గురించి మీతో మాట్లాడేందుకు వస్తే వెళ్ళిపోతానంటే అర్ధం ఏమిటి? అని నిలదీశారు. 

మందకృష్ణను అరెస్ట్ చేస్తే మీరేం చేశారని వారు నిలదీసినప్పుడు మళ్ళీ అయన ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడంతో కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఆయనపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీయే ఆయనకు గవర్నర్ పదవి ఇప్పించిదన్న సంగతి మరిచిపోయి, ముఖ్యమంత్రి కెసిఆర్ కు తొత్తులా మారి మాట్లాడుతున్నారని సర్వే తీవ్రవిమర్శలు చేశారు. 

ఆ మాటలకు గవర్నర్ కూడా సహనం కోల్పోయి సర్వేను కంట్రోల్ చేయమని సూచించగా, మల్లు రవి ముందుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దని గవర్నర్ నరసింహన్ ను హెచ్చరించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతలు వస్తే ఇలాగేనా మాట్లాడుతారు? అని గట్టిగా నిలదీయడంతో గవర్నర్ నరసింహన్ ఆగ్రహంతో సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. అనంతరం టి-కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి మీడియా ప్రతినిధులకు లోపల జరిగిన ఈ వాగ్వాదాల గురించి వివరించారు. 

అనంతరం గవర్నర్ కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్ భవన్ ప్రతిష్టకు భంగం కలగకుండా సుహృద్భావ వాతావరణంలో అర్ధవంతంగా సమావేశం జరిగిందని దానిలో పేర్కొంది. 

టి కాంగ్రెస్ నేతలు గత మూడున్నరేళ్ళ నుంచి గవర్నర్ నరసింహన్ కు పలు సమస్యలపై విజ్ఞప్తి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఏనాడు అయన చొరవ తీసుకొని వాటిని పరిష్కరించేందుకు తెలంగాణా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు కనబడలేదు. అందుకు తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేతలు, గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కేటిఆర్ ను వెనకేసుకువస్తూ మాట్లాడటంతో సహనం కోల్పోయినట్లున్నారు. నిన్న జరిగిన ఈ ఘటనపై తెరాస సర్కార్ ఇంకా స్పందించవలసి ఉంది.