కరీంనగర్ లో ఐటి పార్క్..8న శంఖుస్థాపన!

రాష్ట్రంలో ఐటి రంగవ్యాప్తికి అవకాశం ఉన్న అన్ని జిల్లాలలోను ఐటి పార్కులను ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకు సాగుతోంది. కరీంనగర్ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబోతున్న ఐటి పార్క్ కు రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ఈనెల 8వ తేదీన శంఖుస్థాపన చేయబోతున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.274 కోట్లు ఖర్చుపెట్టబోతోంది. మొదటిదశలో రూ.100 కోట్లతో పార్క్ అభివృద్ధి, నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల ప్రభాకర్, జిల్లా అధికారులు, ఇంజనీర్లు, గుట్టేదారులు తదితరులు గురువారం కరీంనగర్ పట్టణంలో ఉజ్వలపార్క్ వద్ద గల ఐటి టవర్ భూములను, అంబేద్కర్ స్టడీ సర్కిల్ కున్న భూములను పరిశీలించారు. ఈ ప్రాంతంలో రూ.25 కోట్లతో నిర్మించబోయే ఐటి టవర్ కు ఐటి శాఖామంత్రి కేటిఆర్ శంకుస్థాపన చేస్తారు. శంఖుస్థాపన అనంతరం అక్కడ జరుగబోయే బహిరంగ సభలో మంత్రి కేటిఆర్ ప్రసంగిస్తారు. స్థానిక తెరాస నేతలు, అధికారులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.