నేను ఎక్కడికి పారిపోలేదు: ప్రదీప్

గత నెల 31వ తేదీ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం తాగి వాహనం నడిపిస్తూ పోలీసులకు పట్టుబడిన ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, ఆ మరుసటి రోజు నుంచి కనిపించకుండాపోయిన సంగతి తెలిసిందే. పోలీసులు అయన కోసం అయన ఇంటికి, కార్యాలయానికి వెళ్ళగా అవి తాళాలు వేసున్నాయి. కనుక అతను పరారిలో ఉన్నట్లు రాసుకొన్నారు. అతను తక్షణమే తమ ముందు హాజరుకాకపోతే ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులకు బదిలీ చేస్తామని ట్రాఫిక్ పోలీస్ అధికారులు మీడియాకు చెప్పిన మాటలు అజ్ఞాతంలోకి వెళ్ళిన ప్రదీప్ చెవిన కూడా పడినట్లే ఉన్నాయి. అందుకే అయన ఎవరూ ఊహించని విధంగా తన ట్విట్టర్ పేజీలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. 

దానిలో తాను ఎక్కడికి పారిపోలేదని, తన షూటింగ్ పనుల కారణంగా బిజీగా ఉండటం చేత పోలీస్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేకపోయానని , త్వరలోనే పోలీసుల వద్దకు వచ్చి చట్టప్రకారం చేయవలసిన ప్రక్రియలకు హాజరవుతానని ఆ వీడియోలో చెప్పారు. కనుక మీడియా మిత్రులందరూ, ప్రజలూ తాను ఎక్కడికి వెళ్ళిపోయానోనని కంగారు పడవద్దని ప్రదీప్ విజ్ఞప్తి చేశారు.  గతంలో తాను స్వయంగా మద్యం త్రాగి వాహనాలు నడుపవద్దంటూ ప్రచారం చేసిన మాట నిజమేనని, కానీ దురదృష్టవశాత్తు తానే ఆ తప్పును చేశానని కానీ ప్రజలెవరూ తాను చేసిన ఆ తప్పును చేయవద్దని ప్రదీప్ ఆ వీడియోలో అభ్యర్ధించారు. ప్రదీప్ ఆ వీడియో ఏమి చెప్పారో మీరే స్వయంగా చూడండి.