లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ ను ముందు గట్టిగా సమర్ధిస్తూ మాట్లాడిన ఏపి దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, మళ్ళీ కొంతసేపటికే మాట మార్చారు. అయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “గజల్ శ్రీనివాస్ ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతను మహిళల పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తుంటారు. అతను తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవరిస్తారంతే నమ్మశక్యంగా లేదు. బహుశః ఎవరో అతనిని దీనిలో ఇరికించి ఉండవచ్చునని భావిస్తున్నాను,” అని అన్నారు.
ఒకవైపు టీవీ ఛానళ్ళలో గజల్ శ్రీనివాస్ రాసలీలలు ప్రదర్శితమవుతుంటే, మంత్రిహోదాలో ఉన్న మాణిక్యాలరావు ఈవిధంగా శ్రీనివాస్ ను వెనకేసుకు వస్తూ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడం చేతనో లేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర భాజపా నేతలు హెచ్చరించడం వలననో అయన ఈరోజు మాట మార్చారు.
ఈరోజు అయన తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ, “గజల్ శ్రీనివాస్ గురించి నాకున్న అవగాహనతో అతను అటువంటి తప్పు చేసి ఉండడని భావించాను కానీ టీవీలో వస్తున్న ఆయన రాసలీలల వీడియోలు చూసిన తరువాత అతనిపై చాలా జుగుప్స కలిగింది. ఇంతవరకు నేను చూసింది గజల్ అనే నాణానికి ఒకవైపునేనని, రెండవవైపు చాలా జుగుప్సాకరంగా ఉందని గ్రహించాను. మహిళల పట్ల అతను ఆవిధంగా వ్యవహరించడం చాలా తప్పు. దానిని నేను ఖండిస్తున్నాను,” అన్నారు.