నిజామాబాద్ తెరాస ఎంపి కవిత బుధవారం డిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతి రాజును కలిసి జిల్లాలోని జక్రాన్ పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి త్వరలోనే కేంద్ర బృందాన్ని పంపిస్తానని అయన చెప్పినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. ఇదివరకు పౌరవిమాన సేవలందించిన బేగంపేట విమానాశ్రయాన్ని భారతీయ వాయుసేనకు అప్పగించబడటంతో అది తన శిక్షణా విమానాల రాకపోకలకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ప్రముఖుల రాకపోకలకు మాత్రమే వినియోగిస్తున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన విమానాశ్రయం చాలా కాలం నుంచి మూతపడి ఉంది. కనుక ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు ఒకే ఒక్క విమానాశ్రయం అందుబాటులో ఉంది. నిజామాబాద్ జిల్లా తెలంగాణాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నందున, జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. కనుక అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎంపి కవిత కోరారు.
వాస్తవానికి జక్రాన్ పల్లిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు 2008లోనే ప్రతిపాదించారు. దాని కోసం కేటాయించిన 1200 ఎకరాలను ఎయిర్పోర్ట్స్ అధారిటీ 2013లో పరిశీలించి విమానాశ్రయం ఏర్పాటుకు అనుమతించింది. కానీ అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయడం అది లాభసాటి కాదనే అభిప్రాయంతో ఎవరూ దాని నిర్మాణానికి ముందుకు రాలేదు. పైగా భారతీయ వాయుసేన అభ్యంతరాలు కూడా చెపుతుండటంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ ఆ ప్రాజెక్టులో కదలిక వచ్చింది కానీ నిధుల కొరత కారణంగా దానిని పక్కన పెట్టేసింది. మళ్ళీ ఇంతకాలానికి తెరాస సర్కార్ స్వయంగా దాని ఏర్పాటుకు చొరవ చూపించిందంటే అర్ధం నిధుల కొరత సమస్యను అధిగమించిందని భావించవలసి ఉంటుంది.
కేంద్రప్రభుత్వం కూడా పౌరవిమాన సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు, చిన్న చిన్న పట్టణాలలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది కనుక ఎంపి కవిత చేసిన ప్రతిపాదనకు కార్యరూపం దాల్చే అవకాశాలు కనబడుతున్నాయి.