కొత్త సంవత్సరంలో ఈరోజు మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు జరుగబోతున్నాయి. వాటిలో రెండు అత్యంత వివాదాస్పదమైన బిల్లులు లోక్ సభ, రాజ్యసభల ముందుకు రాబోతున్నాయి. ఒకటి ముస్లిం మహిళల వివాహ రక్షణ హక్కుల బిల్లు (ట్రిపుల్ తలాక్) కాగా, మరొకటి ది నేషనల్ మెడికల్ కమీషన్ బిల్.
వాటిలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదముద్ర వేసినందున, దానిని ఈరోజు రాజ్యసభలో చర్చించి ఆమోదింపజేసేందుకు ప్రవేశపెట్టబోతోంది మోడీ సర్కార్. కాంగ్రెస్ పార్టీతో సహా కొన్ని ప్రతిపక్షపార్టీలు దానిని వ్యతిరేకిస్తునందున ఆ బిల్లును అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చు.
ఇక ‘ది నేషనల్ మెడికల్ కమీషన్ బిల్’ ను దేశవ్యాప్తంగా అల్లోపతి వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైద్య సేవలు నిలిపివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఆ బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసినట్లయితే, మెడికల్ కాలేజీలలో ఎం.బి.బి.ఎస్., పిజి, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యలకు సంబంధించి సీట్లు పెంచే అధికారం కేంద్రప్రభుత్వం చేత నియమింపబడే ముగ్గురు సభ్యులతో కూడిన ‘ది మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్’ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ బిల్లుకు ఆమోదముద్ర పడితే ఆయుర్వేదం, హోమియోపతి వైద్యవిద్యలభ్యసించిన వారు కూడా ఇకపై ఆపరేషన్లు చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ బిల్లు నేడు లోక్ సభ ముందుకు రాబోతోంది. దీనిని కూడా ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. కానీ లోక్ సభలో ఎన్డీయే కూటమికే పూర్తి మెజారిటీ ఉంది కనుక ఈ బిల్లు కూడా లోక్ సభ ఆమోదం పొందడం ఖాయమే. మరి రాజ్యసభలో ఈ రెండు బిల్లులను మోడీ సర్కార్ ఏవిధంగా ఆమోదింపజేసుకొంటుందో చూడాలి.