ఇదీ కరోనా మరణమేనా?

July 08, 2020
img

కరోనా కష్టాలు అన్ని ఇన్నీ కావు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో లక్షలమంది చనిపోతుంటే, లాక్‌డౌన్‌ కష్టాలు భరించలేక చాలా మందే చనిపోతున్నారు. అయితే కరోనా మరణాలకు లెక్కలు ఉంటాయి కానీ లాక్‌డౌన్‌ కష్టాలతో చనిపోయేవారివి, ఆ కష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నవారివి ఏ లెక్కలోకి రావు. ఇదీ అటువంటిదే. 

నల్గొండ జిల్లా...చండూరు మండలంలో కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ వయసు ఇంకా 22 ఏళ్ళే. కుటుంబ బాధ్యతలు మీద పడటంతో అప్పు చేసి ఆటోరిక్షా కొనుక్కొని నడిపించుకొంటూ ఆ వచ్చే డబ్బుతో తల్లితండ్రులను పోషించుకొంటున్నాడు. 

ప్రపంచంలో చాలా మందిని కరోనా కాటేస్తుంటే శ్రీకాంత్‌ను లాక్‌డౌన్‌ కాటేసింది. లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా ఆటో తిప్పలేకపోవడంతో ఆర్ధిక సమస్యలు మొదలయ్యాయి. అవి సరిపోవన్నట్లు ఆటోకు ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తులు అప్పు తీర్చమని రోజూ ఒత్తిడి చేస్తుండటంతో శ్రీకాంత్‌ తట్టుకోలేకపోయాడు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించారు కనుక ఆటో తిప్పుకొని అప్పు తీర్చేయాలనుకొన్నాడు. కానీ ఇప్పుడు కరోనా భయంతో ఆటో ఎక్కేవారు తగ్గిపోయారు. దాంతో శ్రీకాంత్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. దాంతో ఈ ఒత్తిళ్ళు, అవమానాలు తట్టుకోలేక మంగళవారం సాయంత్రం పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆర్ధికసమస్యలు భరించలేకనే ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సూసైడ్ నోట్‌లో వ్రాశాడు. కొడుకు ఆత్మహత్య చేసుకొన్నాడనే విషయం తెలియగానే అతని తల్లితండ్రులు రాములు, వెంకటమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేకనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకొన్నాడని పోలిసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్‌కు కరోనా సోకలేదు కానీ కరోనా కారణంగానే చనిపోయాడు. కనుక ఇదీ కరోనా మరణమేనా? అంటే అవుననే అనుకోవాలేమో?

Related Post