
తమిళ హాస్య నటుడు వివేక్ (59) శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు తుది శ్వాస విడిచారు. శుక్రవారం మధ్యాహ్నం హార్ట్ ఎటాక్ తో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన వివేక్ అప్పటికే పరిస్థితి విషమించిందని డాక్టర్లు వెల్లడించారు. అయితే ఎక్మో ట్రీట్ మెంట్ తో పాటుగా డాక్టర్లు తమ శక్తి మేరకు ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. శనివారం ఉదయం వివేక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
తమిళంలో కె.బాలచందర్ పరిచయం చేసిన గొప్ప నటులలో వివేక్ ఒకరు. తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు వివేక్. 300 పైగా సినిమాల్లో నటించిన వివేక్ రజిని, కమల్, విక్రం, సూర్య, అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందాయి. వివేక్ మరణ వార్త విని కోలీవుడ్ షాక్ కు గురైంది.