సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి (73) బాత్ రూమ్ లో గుండెపోటుతో కన్నుమూశారు. విలన్ గా, కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన మరణ వార్త సినీ పరిశ్రమని షాక్ కు గురి చేసింది. బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా జయప్రకాష్ రెడ్డి ప్రేమించుకుందాం రా.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవ రెడ్డి, జయం మనదేరా, సీతయ్య, ఛత్రపతి, బిందాస్, గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, రాజా డి గ్రేట్ సినిమాల్లో నటించారు. జయప్రకాష్ రెడ్డి చివరగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. 

1946 మే 8న జన్మించిన ఆయన చిన్నప్పటి నుండి నాటకాల మీద మక్కువతో నాటక ప్రదర్శనలు చేస్తూ వచ్చారు. నల్గొండలో గప్ చుప్ నాటకం వేయగా అందులో జయప్రకాష్ రెడ్డి నటనను మెచ్చి దాసరి నారాయణ రావు. రెడ్డి గారిని రామానాయుడికి పరిచయం చేశారు. అలా మొదటి సినిమా బ్రహ్మపుత్రుడు ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత ఆయన రాయలసీమ యాసతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో కూడా గుంటూరు విద్యానగర్ లో నాటక రంగంపై మక్కువతోనే అక్కడ ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున బాత్ రూమ్ కు వెళ్లిన జయప్రకాష్ రెడ్డి హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు హాస్పిటల్ కు చేర్చినా అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల సినీ పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయాం అంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు సినీ సెలబ్రిటీస్.