లవకుశ సినిమా యాక్టర్ నాగరాజు మృతి


తెలుగు ప్రజలందరి గుండెల్లో కలకాలం నిలిచిపోయే సినిమాలలో ఒకటి 1963లో విడుదలైన లవకుశ సినిమా. ఎన్టీఆర్, అంజలీదేవి సీతారాములుగా నటించిన ఆ సినిమాలో వారి కవలపుత్రులు లవకుశులుగా నాగరాజు, సుబ్రహ్మణ్యం నటించారు. 

శ్రీరామపట్టాభిషేకం తరువాత అన్న ఆదేశం ప్రకారం లక్ష్మణుడు (కాంతారావు) నిండు గర్భిణిగా ఉన్న వదిన సీతమ్మతల్లిని అడవులలో వదిలివేయడం, అక్కడ ఆశ్రమంలో లవకుశులు జననం, శ్రీరాముడు అశ్వమేధయాగం చేసినప్పుడు దానిని వారు బందించడం, ఆ సందర్భంగా వారిరువురూ తండ్రీతోనే యుద్ధం చేయడం, చివరికి వారు తన బిడ్డలేనని శ్రీరాముడు తెలుసుకోవడం, వారిని తండ్రి చెంతకు చేర్చిన తరువాత సీతమ్మ తల్లి భూమాత ఒడిలోకి వెళ్లిపోవడం ఆద్యంతం ఆ సినిమా చాలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు సి.పుల్లయ్య, ఆయన కుమారుడు సిఎస్ రావు. ఆ సినిమాలో సీతమ్మగా నటించిన అంజలీదేవి ఆ తరువాత సినిమా షూటింగుల కోసం ఏ ఊరికి వెళ్ళినా ఆమెను సీతమ్మగానే భావిస్తూ మహిళలు ఆమెకు హారతులిచ్చేవారు. ఆ సినిమాలో లవకుశుల పాత్రలో బాలనటులుగా నటించిన నాగరాజు, సుబ్రహ్మణ్యం ఆ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచారు. లవకుశులు పాడిన ‘శ్రీరాముని చరితమునూ...‘ అనే పాట నేటికీ తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పాటలలో ఒకటి. వారిలో లవుడుగా నటించిన నాగరాజు ఇవాళ్ళ ఉదయం హైదరాబాద్‌లో తన నివాసంలో మరణించినట్లు తాజా సమాచారం.