
పరారీలో ఉన్న తెలుగు సినీ నిర్మాత నూతన్ నాయుడిని పోలీసులు కర్ణాటకలో ఉడిపి రైల్వేస్టేషన్లో గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో నివాసం ఉంటున్న ఆయన భార్య ప్రియా మాధూరి, తమ ఇంట్లో పనిచేస్తున్న ఓ దళిత యువకుడిని సెల్ ఫోన్ దొంగతనం చేశాడని ఆరోపిస్తూ దారుణంగా హింసించి బలవంతంగా గుండు కొట్టించింది. ఆ యువకుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నూతన్ నాయుడు, భార్య ఆమెకు సహకరించిన మరికొందరిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళిత యువకుడిని హింసిస్తున్నప్పుడు నూతన్ నాయుడు ఇంట్లో లేడు కానీ అతని సూచనల మేరకే దళిత యువకుడికి గుండు కొట్టించినట్లు తెలుస్తోంది.
పోలీసులు తనపై కూడా కేసు నమోదు చేసి వెతుకుతున్నట్లు తెలియగానే నూతన్ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే అతితెలివి ప్రదర్శించి పోలీసులకు దొరికిపోయాడు. కర్ణాటకలోని ఉడిపి నుంచి విశాఖలోని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌కు ఫోన్ చేసి తాను మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ నని పరిచయం చేసుకొని, ఈ కేసులో ఏ-1 నిందితురాలిగా పేర్కొనబడిన ప్రియామాధూరి ఆరోగ్యపరిస్థితి బాగోలేదని కనుక ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చి 2 వారాలు చికిత్స చేయవలసి ఉంటుందని పోలీసులకు రిపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరాడు.
అయితే కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌కు ఇదివరకే పీవీ రమేష్ తో మంచి పరిచయం ఉండటంతో ఆయనకు ఫోన్ చేయడంతో ఈవిషయం బయటపడింది. పీవీ రమేష్ ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు నూతన్ నాయుడి ఫోన్ కాల్ ఆధారంగా అతను ఉడిపిలో ఉన్నాడని గుర్తించి వెంటనే అక్కడకు చేరుకొన్నారు. అతను ఉడిపి నుంచి రైల్లో ముంబైకు బయలుదేరుతుంటే రైల్వేస్టేషన్లో అరెస్ట్ చేసి విశాఖకు తీసుకువస్తున్నారు.