
ప్రస్థానం సినిమాతో తనకంటూ ఓ మార్క్ ఏర్పరచుకున్న దేవా కట్ట ఆ తర్వాత ఆ రేంజ్ సినిమాలు తీయడంలో వెనకపడ్డాడు. రెండు మూడు ప్రయత్నాలు చేసినా అవి వర్క్ అవుట్ కాలేదు. ఈమధ్యనే బాలీవుడ్ లో ప్రస్థానం రీమేక్ చేసి పర్వాలేదు అనిపించుకున్న దేవా కట్ట ప్రస్తుతం సాయి ధరం తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా వెబ్ సీరీస్ ప్లాన్ చేశారు దేవా కట్ట.
చంద్రబాబు నాయుడు, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహం గురించి ఓ కథ రాసుకున్నారు దేవా కట్ట. సినిమాగా చేద్దామని అనుకున్న ఆ కథ కాస్త వెబ్ సీరీస్ గా మారిందట. అయితే ఇదే కథతో ఎన్.టి.ఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఓ వెబ్ సీరీస్ చేస్తున్నాడని తెలిసి అతని మీద లీగల్ యాక్షన్ కు దిగడానికి సిద్ధమైన దేవా కట్ట తను రాసుకున్న కథతో ఇంద్రప్రస్థం అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. చంద్రబాబు, వైఎస్సార్ షాడో పిక్స్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ వెబ్ సీరీస్ పై అంచనాలు పెంచింది. టాలెంట్ ఉన్నా కెరియర్ లో వెనకపడ్డ దేవా కట్ట ఈ వెబ్ సీరీస్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు.