చిరు సినిమాలో విజయశాంతి..?

సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలిసిందే. సైరా రిలీజ్ తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందించనున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా నటిస్తుందని తెలుస్తుంది. 2007 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి 12 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. 

ఈ సినిమాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మూవీలో కూడా ఛాన్స్ కొట్టేసిందట. చిరు, విజయశాంతి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరి కలిసి 19 సినిమాల దాకా నటించారు. అందులో 10 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలకు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ గా బిజీ అయిన విజయశాంతి మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. మరి అప్పట్లో చిరు హీరోగా విజయశాంతి హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి. అసలు చిరంజీవి సినిమాలో విజయశాంతి నటించడం కన్ఫామా కాదా అన్నది కూడా త్వరలో తెలుస్తుంది.