నాకు స్పూర్తి ప్రదాత చిరంజీవి అన్నయ్య : పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి 64వ పుట్టినరోజు వేడుకలు ఎప్పటిలానే అంగరంగ వైభవంగా జరిగాయి. బుధవారం సాయంత్ర శిల్పకళా వేదికలో చిరు బర్త్ డే సెలబ్రేషన్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. మెగా ఫ్యాన్స్ సమక్షంలో అన్నయ్య మీద తనకున్న అభిమానం ప్రేమను చాటుకున్నాడు పవన్ కళ్యాణ్.

తాను ఇక్కడకు అన్నయ్య అభిమానిగా వచ్చానంటూ స్పీచ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ తన జీవితానికి అన్నయ్య స్పూర్తి ప్రదాత అన్నారు. చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు అది పండుగ రోజు. చిరంజీవి అంటే ఒక్క మెగాస్టార్ మాత్రమే కాదు మూర్తీభవించిన స్పూర్తి.. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా పెద్ద కలలు కనడం, ఆ కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడాలనే జీవన విధానానికి చిరంజీవి గారి ప్రస్థానమే నిదర్శనమని అన్నారు. కలలు సాకారమై, ఉన్నత శిఖరాలను అందుకున్న తర్వాత కూడా నిగర్విగా, నిరాడంబరంగా ఉండటం తన మూలాలను మర్చిపోని స్పృహతో ఉండటం చిరంజీవి గారి వల్లే అవుతుందని అన్నారు.        

ఇక ఈ పుట్టినరోజు చాలా స్పెషల్ అని.. భారత జాతి మరచిన ఓ ధీరుడు చరిత్రను సైరా నరసింహా రెడ్డి అంటూ ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు చిరంజీవి. ఇంటర్ విద్యార్ధుల సూసైడ్ అంశం తనని బాధించిందని.. అయితే తను కూడా ఇంటర్ ఫెయిల్ అయ్యాక అన్నయ్య లైసెన్సెడ్ గన్ తో షూట్ చేసుకోవాలని అనుకున్నాను కాని అన్నయ్య తనని మోటివేట్ చేశారని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.    

సైరా సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించడం జరిగిందని.. ఈ సినిమా షూటింగ్ లో ఆయన్ను కలిసే అదృష్టం కలిగిందని అన్నారు పవన్ కళ్యాణ్. తను ఎంత ఎదిగినా అన్నయ్య మీద అభిమానం ఎప్పటికి అలానే ఉంటుందని మరోసారి తన ప్రసంగం ద్వారా చూపించాడు పవన్ కళ్యాణ్. చిరు బర్త్ డే ఈవెంట్ లో అల్లు అరవింద్, మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, హిరంజీవి చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ లు అటెండ్ అయ్యారు.