
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిని పరిశ్రమ హైదరాబాద్ నుండి వైజాగ్ కు షిఫ్ట్ అవుతుందని హడావిడి చేశారు. పరిశ్రమను షిఫ్ట్ చేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. చెన్నై నుండి తెలుగు పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడానికే చాలా టైం పట్టింది. ఇప్పుడు హైదరాబాద్ నుండి వైజాగ్ కు పరిశ్రమ తరలించడం అంటే మాములు విషయం కాదు. అయితే ఇప్పటికే వైజాగ్ లో సినిమా షూటింగులు ఎక్కువయ్యాయి.
ఇదవరకు కన్నా ఇప్పుడు షూటింగులు ఎక్కువ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. వైజాగ్ లో ఆల్రెడీ రామానాయుడు స్టూడియోస్ ఉంది. ఈమధ్య నందమూరి బాలకృష్ణ కూడా వైజాగ్ లో స్టూడియో కట్టించాలనే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. చెన్నై ఏ.వి.ఎం స్టూడియోస్ వారు కూడా భీమిలి కాపులప్పాడ పరిసర ప్రాంతాల్లో స్థలాన్ని కొని స్టూడియో నిర్మించాలని భావించారు.
పరిశ్రమ వైజాగ్ కు మారాలంటే అక్కడి ప్రభుత్వం పూర్తి మద్ధతు ఇవ్వాల్సిందే. ప్రభుత్వ పరమైన అన్ని ఏర్పాట్లను చేస్తేనే స్టూడియోలు నిర్మించడం జరుగుతుంది. ముందు స్టూడియో నిర్మాణానికి కావాల్సిన స్థలం ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతకు వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ కు ఆనుకుని రెండు ఎకరాల స్థలం ఉందట. దానికి తోడుగా ప్రభుత్వం మరో 3 ఎకరాలు ఇస్తే స్టూడియో కట్టించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
అంతకుముందు సిని పరిశ్రమ వైజాగ్ లో ఏర్పాటుకై చురుకుగా ఉన్న ఏపి ప్రభుత్వం ఎలక్షన్స్ దగ్గర పడుతుండటంతో ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. సముద్ర తీరానికి సిని పరిశ్రమ వెళ్లినా హైదరాబాద్ కు ఉండే క్రేజ్ ఎప్పటికి అలానే ఉంటుంది. ఆరెఫ్సితో పాటుగా ఫిల్మ్ నగర్ అంతా సిని సందడిగా ఉంటుంది. మరి అవన్ని ఒక్కసారిగా వైజాగ్ కు మార్చడం కుదరని పనే..!