రాష్ట్ర సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావు సోమవారం రాత్రి సుమారు 8 గంటలకు సిద్ధిపేట నుంచి బయలుదేరి పెద్దపల్లి జిల్లాలో మల్లాపూర్ వద్ద జరుగుతున్న టన్నెల్ పనులను పరిశీలించారు. ఆ తరువాత ధర్మారం మండలంలో అండర్ టన్నెల్ వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సాగుతున్న 6, 7 ప్యాకేజీ పనులను పరిశీలించారు. రాత్రి 3 గంటల వరకు ఆయన పర్యటిస్తూనే ఉన్నారు.
ఆ సమయంలో కూడా అక్కడే ఉండి పనులు చేయిస్తున్న ప్రాజెక్టు మేనేజర్లను, అధికారులను హరీష్ రావు అభినందించారు. ఆయా పనుల పురోగతి గురించి వారిని అడిగి తెలుసుకొన్నారు. పనుల జరుగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. మే నెలాఖరులోగా అన్ని పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని కోరారు. ఆలోగా పనులు పూర్తయితే జూన్ నాటికల్లా ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించడం సాధ్యం అవుతుందని అన్నారు. అయితే పనులు వేగంగా చేస్తున్నప్పటికీ నాణ్యతలో రాజీపడరాదని స్పష్టం చేశారు. తెల్లవారుజాము వరకు తన పర్యటనను కొనసాగించిన మంత్రి హరీష్ రావు సుందిళ్ళ బ్యారేజి వద్ద కాసేపు పడుకొని మళ్ళీ సిద్ధిపేటకు తిరిగి వెళ్ళిపోయారు.
మంత్రి హరీష్ రావుకు ఇంత తపన, చిత్తశుద్ధి ఉంది కనుకనే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులలో నిర్మాణపనులు చురుకుగా సాగుతున్నాయి. కేవలం 42 నెలల వ్యవధిలోనే ఇన్ని బారీ ప్రాజెక్టులు చేపట్టడం, వాటిలో చాలా వరకు నిర్మాణ పనులను పూర్తిచేయగలగడం నిజంగా చాలా గొప్ప విషయమే. అందుకు మంత్రి హరీష్ రావును, నీటిపారుదల శాఖ అధికారులు, ఉద్యోగులు, రేయింబవళ్ళు కష్టపడుతున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కార్మికులు అందరినీ అభినందించవలసిందే. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్రంలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది కనుక రాష్ట్ర ముఖచిత్రం మారిపోవడం తధ్యం.