ఏపి, తెలంగాణా ప్రభుత్వాలకు ఏదో ఒక విషయంలో హైకోర్టు తరచూ మొట్టికాయలు వేస్తూనే ఉంది. అవి కూడా వాటికి అలవాటయిపోయాయినట్లున్నాయి. అందుకే మొట్టికాయలు వేయించుకోవడాన్ని అవి అవమానకరంగా భావిస్తున్నట్లు లేవు. వాటి తీరు చూసి హైకోర్టు ఇంకా కోపగించుకొంది.
తమ ఉత్తర్వులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తేలికగా తీసుకొంటున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జి.శ్యాం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలలో ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం భూసేకరణ చేస్తున్నప్పుడు ముందుగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతనే ముందుకు సాగాలని తాము ఇచ్చిన ఆదేశాలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వెంకటకృష్ణయ్య కొన్ని రోజుల క్రితం హైకోర్టుకు ఒక లేఖ వ్రాశారు. భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో జరుగుతున్న జాప్యం కారణంగా భాదితులు కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్లు వేస్తున్నారని అవి నానాటికీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని పరిష్కరించమని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినప్పటికీ స్పందన కనబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ల కారణంగా ఇతర కేసుల విచారణ కూడా ఆలస్యమయిపోతోందని, దాంతో నానాటికీ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన హైకోర్టు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు పంపించింది. ఆ కేసుపై మంగళవారం విచారణ జరిగినప్పుడు హైకోర్టు ధర్మాసనం ఇరు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా రెండు ప్రభుత్వాలు తమ తీరు మార్చుకొని నిర్వాసితులకు నష్టపరిహారం అందించకపోతే, భూసేకరణను నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేయవలసి వస్తుందని హెచ్చరించింది. ఇంతవరకు రెండు ప్రభుత్వాలు నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాయో..ఇంకా ఎంత చెల్లించవలసి ఉందో..దానిని ఎప్పటిలోగా చెల్లిస్తాయో మొదలైన వివరాలను నాలుగు వారాలలోగా సమర్పించాలని లేకుంటే భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయవలసి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది.