జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాజౌరీ సెక్టార్ ప్రాంతంలో భారత్-పాక్ సరిహద్దుల వద్ద మళ్ళీ యుద్ధవాతావరణం ఏర్పడింది. ఈ నెల 23న పాక్ సైనికులు జరిపిన కాల్పులలో ఒక ఆర్మీ మేజర్, ముగ్గురు జవాన్లు చనిపోవడంతో అందుకు ప్రతీకారంగా భారత జవాన్లు సోమవారం లైన్-ఆఫ్-కంట్రోల్ ను దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముగ్గురు పాక్ సైనికులను హతమార్చారు. వారి కాల్పులలో మరొక పాక్ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.
2017లో పాక్ సైనికులు 771 సార్లు కాల్పులు జరిపారు. వాటిలో 12మంది పౌరులు, 14మంది సరిహద్దు భద్రతదళాల సైనికులు చనిపోయారు. మూడు రోజుల క్రితం పాక్ సైనికులు జరిపిన కాల్పులలో మహారాష్ట్ర లోని బండారాకు చెందిన మేజర్ మొహర్కర్ ప్రఫుల్ల అంబాదాస్ (32), అమృతసర్ కు చెందిన లాన్స్ నాయక్ గురుమెయిల్ సింగ్ (34), హర్యానాలో కర్నాల్ కు చెందిన సిపాయ్ పర్గాట్ సింగ్ (30), మరో ఇద్దరు జవాన్లు చనిపోయారు. పాక్ సైనికులు తమ సహచరులను చంపినందుకు ప్రతీకరేచ్చతో రగిలిపోతున్న భారత జవాన్లు సోమవారం లైన్-ఆఫ్-కంట్రోల్ ను దాటి పాక్ భూభాగంలోకి ప్రవేశించి ముగ్గురు పాక్ సైనికులను హతమార్చారు. పాక్ అనాలోచిత దుందుడుకు చర్యల కారణంగా అన్యాయంగా ఇరుదేశాల సైనికులు ప్రాణాలు కోల్పోతుండటం చాలా బాధాకరం.