హైదరాబాద్ లో ఇంత చలా...అయ్య బాబోయ్!

కొన్నేళ్ళ క్రితం చలికాలంలో రాష్ట్రంలో కనీస ఉష్ణోగ్రతలు 18-21 డిగ్రీలుండేవి కనుక చలీకాలంలో చాలా ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉండేది. కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం రాష్ట్రంపై కూడా పడుతున్నట్లుంది. ఇప్పటికే అదిలాబాద్ వంటి కొన్ని జిల్లాలలో రాత్రిపూట కనీస ఉష్ణోగ్రతలు 10-12 డిగ్రీలకు పడిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 12-15 డిగ్రీలు ఉంటోంది. నగరశివారు ప్రాంతాలైన పటాన్ చెరు, బి.హెచ్.ఈ.ఎల్., ఉప్పల్, రామంతాపూర్ మౌలాలీ, ఆరామ్ ఘర్, బండ్లగూడ, శంషాబాద్, అత్తాపూర్, హయత్ నగర్, ఎల్.బి.నగర్ మొదలైన ప్రాంతాలలో రాత్రిపూట కనీస ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోతుండటంతో ప్రజలు చాలా ఇబ్బందిపడుతున్నారు. 

ముఖ్యంగా ఆరుబయట ఫుట్ పాత్ లు, దుఖాణాల ముందు, గుడిసెలలో నివసించేవారు..మళ్ళీ వారిలో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఈ విపరీతమైన చలి కారణంగా రాత్రిపూట నరకం అనుభవిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా డిల్లీ సర్కార్ మాదిరిగానే పేదలు రాత్రిపూట తలదాచుకొనేందుకు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి వారికి రగ్గులు సరఫరా చేయగలిగితే బాగుంటుంది. 

రాష్ట్రంలో కార్పోరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు, స్వచ్చందం సంస్థలు చలిలో నరకం అనుభవిస్తున్న ఆ పేద ప్రజల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసి వారికి రగ్గులు అందించగలిగితే బాగుంటుంది. ఆరుబయట నివసిస్తున్న వారే కాకుండా వివిధ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ లో నివసిస్తున్న నిరుపేద బాలబాలికల పరిస్థితి కూడా అలాగే ఉంది. 

ఇటీవల ఒక జిల్లా ప్రభుత్వ హాస్టల్ లో పిల్లలు ఎదుర్కొంటున్న ఈ దుర్భర పరిస్థితుల గురించి అమెరికాలో స్థిరపడిన ఎన్.ఆర్.ఐ.ల దృష్టికి తీసుకువెళ్ళగా వారు ఆ మరుసటిరోజుకల్లా సుమారు 300 మందికి రగ్గులు అందజేసి ఆదుకొన్నారు. ఎక్కడో విదేశాలలో ఉంటున్న ఎన్.ఆర్.ఐ.లు చేయగా లేనిది రాష్ట్రంలో... హైదరాబాద్ లోనే నివసిస్తున్న ప్రజలు ఈ మాత్రం సాయం చేయలేరా? రాష్ట్రంలో ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా తమ ఇళ్ళలో వృధాగా పడున్న పాత దుప్పట్లు, రగ్గులు, పరుపులను ఆ నిరుపేదలకు అందించి వారికి సహాయపడగలిగితే వారి ప్రాణాలను కాపాడినవారవుతారు కదా!