రేవంత్ రెడ్డి వెర్సస్ తెరాస యుద్ధం

రేవంత్ రెడ్డి తెదేపాలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కెసిఆర్ ను, తెరాస సర్కార్ ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుండేవారు. కాంగ్రెస్ పార్టీలోకి మారిన తరువాత కాస్త జోరు తగ్గినట్లనిపిస్తున్నప్పటికీ, వారం రోజుల క్రితం జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్ జనగర్జనసభలో మళ్ళీ చెలరేగిపోయారు. ఈసారి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి లక్ష్మారెడ్డిపై తీవ్రవిమర్శలు గుప్పించారు. వెంటనే తెరాస నేతలు కూడా ఘాటుగా స్పందించారు. మంత్రి లక్ష్మారెడ్డి స్వయంగా రేవంత్ రెడ్డి విమర్శలకు ఘాటుగా జవాబు చెప్పి వ్యక్తిగత దూషణలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. కనుక అంతటితో ఈ వ్యవహారం ముగిసిపోయిందనే అందరూ భావించారు. కానీ తెరాస ఫౌండర్స్ ఫోరం తరపున కొందరు నేతలు రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ రెండవ పట్టాన పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పట్ల రేవంత్ రెడ్డి వాడిన బాష చాలా అనుచితంగా ఉందని, అదే విధంగా సభలో అయన మాట్లాడిన మాటలతొ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని తమ పిర్యాదులో పేర్కొన్నారు. వారి పిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని రేవంత్ రెడ్డిపై చట్టప్రకారం ఏమైనా చర్యలు చేపడతారో లేదో చూడాలి. చేపడితే తెరాస- రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీల మద్య మరో కొత్త యుద్ధం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.