రూ. 2,000 నోట్ల ముద్రణపై మొదటి నుంచి రకరకాల ఊహాగానాలు, అభిప్రాయలు వస్తూనే ఉన్నాయి. వాటిని 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రద్దు చేయడానికే ప్రవేశపెట్టారని, తద్వారా దేశంలో మళ్ళీ ఆ రూపంలో పోగైన నల్లడబ్బును వెలికితీసి చూపించి ప్రజలను మెప్పించి ఎన్నికలలో గెలవాలనేది మోడీ ఆలోచన అని ఊహాగానాలు వినిపించాయి. మూడు,నాలుగు నెలల క్రితం రూ.200 నోట్లు ప్రవేశపెడుతున్నామని కేంద్రం ప్రకటించినప్పుడు, వాటి ముద్రణకు వీలుగా రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. మళ్ళీ తాజాగా వెలువడిన ఎస్.బి.ఐ. రీసెర్చ్ రిపోర్టులో రిజర్వ్ బ్యాంక్ రూ.2,000 నోట్ల ముద్రణను నిలిపివేయడమో లేదా మార్కెట్లలోకి విడుదలను తగ్గించడమో చేస్తున్నట్లు పేర్కొంది. దాని గురించి మీడియాలో విస్తృతంగా వార్తలు, విశ్లేషణలు రావడంతో అనేకమంది ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంకులో జమా చేసేందుకు క్యూలు కట్టారు. కనుక మళ్ళీ ఈ వార్తలపై కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఈయవలసి వచ్చింది.
అయన డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రూ.2,000 నోట్ల ముద్రణ, సరఫరా తగ్గిస్తున్నట్లు లేదా నిలిపివేస్తున్నట్లు మీడియా వస్తున్న వార్తలన్నీ పుకార్లే. వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి అంశాలపై రిజర్వ్ బ్యాంక్ లేదా కేంద్రప్రభుత్వం అధికారికంగా చేసే ప్రకటనలను తప్ప వేరేవాటిని నమ్మవద్దు,” అని దేశప్రజలను కోరారు.