ప్రజాప్రతినిధుల దౌర్జన్యం...ప్రభుత్వానికి చెడ్డపేరు

రాష్ట్రంలో తెరాస మంత్రులు చాలా విషయాలలో సంయమనంగానే వ్యవహరిస్తుంటారు కానీ కొంతమంది ఎమ్మెల్యేల తీరే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేవిధంగా ఉంటోంది. రెండు రోజుల క్రితమే తెరాస నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం డిసిసి బ్యాంక్ సిఈఓను ఫోన్లో దుర్భాషలాడిన వార్త మీడియాలో ప్రముఖంగా వచ్చింది. తాజాగా మరో తెరాస ఎమ్మెల్యే, ఆమె భర్త టోల్ గెట్ సిబ్బందిపై దౌర్జన్యం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 

చొప్పదండి తెరాస ఎమ్మెల్యే బొడిగె శోభ తన భర్త గాలన్నతో కలిసి మంగళవారం ఉదయం కరీంనగర్ నుంచి కారులో హైదరాబాద్ బయలుదేరారు. దారిలో తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద గల టోల్ గేట్ లో కార్లు వెళ్ళే మార్గంలో ఒక వాహనం చెడిపోయి నిలిచిపోవడంతో, టోల్ గేట్ సిబ్బంది అన్ని వాహనాలను పక్కనే ఉన్న మరో గేట్ ద్వారా పంపిస్తున్నారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి ఆ గేట్ లో ఒక ఆటోరిక్షా డ్రైవర్ టోల్ ఫీజ్ చెల్లిస్తున్నాడు. ఆ కారణంగా ఎమ్మెల్యే వాహనం ఆ ఆటో వెనుక ఆగవలసి వచ్చింది. దాంతో ఎమ్మెల్యే శోభకు ఆమె భర్త గాలన్నకు కోపం వచ్చి టోల్ గేట్ ఉద్యోగి జీవన్ పై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేనయినా తాను వచ్చినా టోల్ గేట్ వద్ద వాహనాన్ని ఆపడం ఏమిటని అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఉద్యోగి వారికి పరిస్థితి వివరించి నచ్చజెప్పే ప్రయత్నం చేయబోగా భార్యాభర్తలిద్దరూ అతనిపై విరుచుకుపడ్డారు. వారి వాగ్వాదాన్ని మొబైల్ ఫోన్ తో రికార్డు చేస్తున్న మరో ఉద్యోగి రాజును ఎమ్మెల్యే గన్ మెన్స్ కొట్టి అతని సెల్ ఫోన్ లాక్కొన్నారు. 

ఎమ్మెల్యే చేసిన ఈ హాడావుడి కారణంగా టోల్ గేట్ కు ఇరువైపులా సుమారు రెండు గంటల పాటు బారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దానిని క్లియర్ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు రంగంలో దిగవలసి వచ్చింది.

ఎమ్మెల్యేలు ఈవిధంగా ప్రవర్తించడం వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సామాన్య రాజకీయ కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కాగానే ఆకాశం నుంచి ఊడిపడ్డామనే భావనతో ఇంత అహంకారంగా వ్యవహరించడం చాలా తప్పు. టోల్ గేట్ వద్ద రెండు నిమిషాలు వేచి చూడవలసివస్తే దానిని అవమానంగా భావించడం చాలా తప్పు. దాని కోసం ఆ ఎమ్మెల్యే, ఆమె భర్త చేసిన గొడవ కారణంగా టోల్ గేట్ వద్ద రెండు గంటలు ట్రాఫిక్ జామ్ అవడంతో వందలాదిమంది వాహనదారులు నానా ఇబ్బందిపడవలసి వచ్చింది. 

ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేస్తున్నా ఎమ్మెల్యేలు ఈవిధంగా అహంకారం ప్రదర్శిస్తూ సామాన్య ప్రజలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటే వారి వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. కనుక ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించి కట్టడి చేయడం చాలా అవసరం.